ఈ వారం థియేట‌ర్లో విడుద‌ల‌వుతున్న చిత్రాలు ఇవే..

August 31, 2021

ఈ వారం థియేట‌ర్లో విడుద‌ల‌వుతున్న చిత్రాలు ఇవే..

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తర్వాత థియేటర్లు తెరుచుకోవడంతో చిన్న సినిమాలన్నీ రిలీజ్ కు క్యూ కడుతున్నాయి. అయితే మీడియం లేదా హై రేంజ్ సినిమాల రిలీజ్‌లు మాత్రం వెన‌క్కి త‌గ్గుతున్నాయి. దాంతో ప్రతీ వారం దాదాపు ఆరుకు పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్ అయిన సినిమాల్లో తిమ్మ‌ర‌సు, ఎస్ ఆర్ క‌ళ్యాణ మండ‌పం, రాజ రాజ చోర‌, శ్రీ‌దేవి సోడా సెంట‌ర్‌, ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు త‌ప్పితే మిగ‌తా సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయ్యాయో కూడా తెలీని ప‌రిస్థితి. ఈ క్రమంలో ఈ శుక్రవారం మరో ఆరు చిత్రాలు థియేట‌ర్స్‌లో రిలీజ్ కు రెడీ అయ్యాయి. వాటి వివ‌రాలు..

నూటొక్క జిల్లాల అందగాడు

బట్టతల ఉన్న వ్యక్తి ఓ అమ్మాయి ప్రేమ కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే క‌థాశంతో
తెర‌కెక్కిన చిత్రం ”నూటొక్క జిల్లాల అందగాడు”. అగ్ర దర్శకనిర్మాతలు క్రిష్ జాగర్లమూడి – దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో వ‌స్తోన్న‌ సినిమా కావడంతో అందరి దృష్టి దీనిపై పడింది. అవసరాల శ్రీనివాస్ – రుహానీ శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి రాచకొండ విద్యాసాగర్ దర్శకుడు. ఈ సెప్టెంబరు 3న థియేటర్లలో విడుదల కానుంది.

డియర్ మేఘ

ముక్కోణపు ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ”డియర్ మేఘ” చిత్రం కూడా సెప్టెంబర్ 3నే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇది క‌న్న‌డ‌లో మంచి విజ‌యం సాధించిన దియా సినిమాకు రీమేక్‌. మేఘా ఆకాష్ – అరుణ్ అదిత్ – అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో న‌టించారు. సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో అర్జున్ దాస్యన్ నిర్మించారు. ఏషియన్ సినిమాస్ ద్వారా దాదాపు 300లకు పైగా థియేటర్లలో ఈ చిత్రం రిలీజ్ అవుతుండ‌డంతో ఈ సినిమాపై ఓ మోస్తారు క్రేజ్ నెల‌కొని ఉంది. అలాగే ఇదే క్రమంలో ‘ది కిల్లర్’ అనే క్రైమ్ థ్రిల్లర్ – ‘అప్పుడు ఇప్పుడు’ అనే కామెడీ ఎంటర్టైనర్ – ‘అశ్మీ’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు సెప్టెంబర్ 3న థియేటర్లలోకి వస్తున్నాయి.

ఎఫ్ 9

ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ప్రాంఛైజీలో తొమ్మిదో సినిమా ”ఎఫ్ 9” ను కూడా ఈ శుక్రవారమే భారతీయ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. యాక్షన్ సినీ ప్రియులను విశేషంగా అలరించిన ఈ సినిమాలకు ఇక్కడ కూడా భారీ క్రేజ్ ఉంది. ‘ఎఫ్ 8’ ఇండియాలో భారీ వసూళ్ళు రాబట్టడమే దీనికి నిదర్శనం. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా వచ్చిన F9 ఇప్పటికే అంతర్జాతీయంగా కాసుల వర్షం కురిపిస్తోంది.సెప్టెంబరు 3న ఈ చిత్రం తెలుగు హిందీ ఇంగ్లీష్ లతో పాటు పలు భారతీయ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ఈ వారం విడుద‌ల‌య్యే సినిమాల్లో నూటొక్క జిల్లాల అందగాడు, డియర్ మేఘ, ఎఫ్ 9 సినిమాల్లో ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ఏ సినిమాకు ద‌క్కుతుందో ఈ శుక్ర‌వారం వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.