September 1, 2021
యాక్షన్ హీరో విశాల్ – దర్శకుడు ఎ వినోద్ కుమార్ ఓ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం చేతులు కలిపారు. విశాల్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 29న చెన్నైలోని ప్రముఖ సాయిబాబా ఆలయంలో ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. మరుసటి రోజు ఆగస్టు 30 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఓ వీడియోని మేకర్స్ రిలీజ్ చేసారు. రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నటుడు రమణ – నంద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో విశాల్ సరసన ఇటీవల ‘రాజ రాజ చోర’ తో హిట్ కొట్టిన సునయన హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో విశాల్ – సునైన ‘వేటాడు వెంటాడు’ అనే చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ‘#Vishal32′ కోసం ఓ పవర్ ఫుల్ టైటిల్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. సమాజంలో పెద్ద మార్పు తీసుకురావడాన్ని ప్రభావితం చేసే ఆబ్జెక్ట్ ను టైటిల్ గా పెట్టినట్లు మేకర్స్ తెలిపారు. అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు ఒకే టైటిల్ ఉంటుందని.. త్వరలో ప్రకటిస్తారని వెల్లడించారు.
‘Vishal32’ చిత్రానికి పొన్ పార్థిబన్ కథ అందిస్తున్నారు. గతంలో విశాల్ అనేక హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాల్లో నటించారు. అయితే ఈ సినిమాలో మాత్రం కొన్ని ఊపిరి పీల్చుకునే యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని.. సెకండ్ హాఫ్ లో 40 నిమిషాల యాక్షన్ బ్లాక్స్ హైలైట్ గా నిలుస్తాయని.. ఇవి యాక్షన్ మూవీ ప్రియులను అలరిస్తాయని చిత్ర బృందం తెలిపింది. ఫైట్ మాస్టర్ దిలిప్ సుబ్బరాయన్ ఈ యాక్షన్ సీక్వెన్స్ లను సూపర్వైజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ సిఎస్ సంగీతం సమకూరుస్తుండగా.. బాలసుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.