రామ‌బాణం రివ్యూ, రేటింగ్‌

May 5, 2023

రామ‌బాణం రివ్యూ, రేటింగ్‌

చిత్రం: రామబాణం; న‌టీన‌టులు: గోపీచంద్, డింపుల్ హయాతీ, జగపతి బాబు, ఖుష్బూ, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా త‌దిత‌రులు; సంగీతం: మిక్కీ జె మేయర్; ఛాయాగ్ర‌హ‌ణం: వెట్రి పళనిసామి; ఎడిటింగ్‌: ప్రవీణ్ పూడి; కథ: భూపతి రాజా;  ఆర్ట్‌: కిరణ్ కుమార్ మన్నె; నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్; దర్శకత్వం: శ్రీవాస్; నిర్మాణ‌ సంస్థ‌: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ;  విడుద‌ల‌: 05-05-2023

ఈ మ‌ధ్య కాలంలో గోపిచంద్ టైమ్ అస‌లు బాగోలేదు…ఒక హిట్ వ‌స్తే రెండు మూడు ప్లాఫులు అన్న‌ట్టుగా ఉంది ప‌రిస్థితి. ఆ మ‌ధ్య సీటీమార్ తో యావ‌రేజ్ హిట్ అందుకుని మ‌ళ్లీ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాతో ప్లాఫుని చవిచూశాడు. ప్ర‌స్తుతం లక్ష్యం, లౌక్యం లాంటి హిట్స్ తర్వాత డైరెక్టర్ శ్రీవాస్, గోపిచంద్ కాంబినేష‌న్‌లో వస్తున్న సినిమా కావ‌డంతో రామ‌బాణంపై మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి. అయితే ట్రైల‌ర్ చూడ‌గానే మ‌ళ్లీ రెగ్యుల‌ర్ ఫార్మాట్‌లోనే ఉండ‌నుంద‌ని తెలిసిపోయింది. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించిన ఈ మూవీలో ఖిలాడి బ్యూటీ డింపుల్ హయాతి కథానాయికగా నటించింది. ఈ మూవీ ఈరోజు (మే5న) ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందామా.

క‌థ‌: రఘుదేవ పురం అనే గ్రామంలో రాజారాం (జగపతి బాబు), అతని భార్య భువనేశ్వరి (ఖుష్బూ) ఆర్గానిక్ హోటల్ నడుపుతూ ఉంటాడు. అతని తమ్ముడు విక్కీ (గోపీచంద్). చిన్నప్పుడే అన్నయ్యతో గొడవ పెట్టుకుని ఎలాగైనా డ‌బ్బు సంపాదించాకే తిరిగొస్తాన‌ని విక్కీ ఊరు వదిలి పారిపోతాడు. దానిలో భాగంగా కోల్ కతాలో పెద్ద డాన్ గా ఎదుగుతాడు. అక్కడే భైరవి (డింపుల్ హయతి)తో ప్రేమలో పడతాడు. కానీ కుటుంబం ఉంటేనే భైరవిని ఇచ్చి పెళ్లి చేస్తానని ఆమె తండ్రి (సచిన్ ఖేడ్కర్) కండిషన్ పెట్ట‌డంతో 14 సంవత్సరాల తర్వాత విక్కీ త‌న‌ అన్న దగ్గరకి వస్తాడు. కానీ బిజినెస్ మాన్ జీకే (తరుణ్ అరోరా) కారణంగా అన్నకి సమస్య ఉందని తెలుస్తుంది. ఈ సమస్యని విక్కీ ఎలా పరిష్కరించాడు? తమ్ముడు డాన్ అని రాజారాంకి తెలిసిందా? భైర‌విని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అనేదే రామ‌బాణం క‌థ‌.

విశ్లేషణ: చిన్నపుడు ఎప్పుడో ఇంటి నుంచి వెళ్లిపోయిన హీరో తిరిగి వచ్చి ఫ్యామిలీ కష్టాలు తీర్చడం అనే ఫార్ములా కథలు మనకు కొత్తేమీ కాదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచి ఇలాంటి కథలు చూస్తూనే ఉన్నాం. కనెక్ట్ అయిన ప్రతిసారీ సక్సెస్ లు కూడా అవుతూనే ఉన్నాయి. లక్ష్యం, లౌక్యంలతో వరుసగా రెండు హిట్లు కొట్టిన గోపీచంద్, శ్రీవాస్ కాంబో కూడా హ్యాట్రిక్ సక్సెస్ కోసం ఈ ఫార్ములానే నమ్ముకుంది. కానీ ఫార్ములాతో పాటు ట్రీట్‌మెంట్ కూడా పాతదే కావడం ‘రామబాణం’ని గురి తప్పేలా చేసింది.

చిన్నప్పుడు ఇంట్లో గొడవ పడి హీరో పారిపోవడం, కోల్‌కతా వెళ్లి పెద్ద డాన్ అవ్వడం, వెంటనే హీరోయిన్ ఎంట్రీ… ఇలా సీన్లన్నీ వరుసగా పేర్చుకుంటూ వెళ్లిపోయారు దాంతో ఆడియ‌న్స్ రొటీన్ గా ఫీల్ అవుతారు. హీరో, హీరోయిన్ల మధ్య ప్రత్యేకమైన లవ్ ట్రాక్ పెట్టకుండా ఒక సాంగ్‌లోనే వారు ఎలా ప్రేమించుకున్నారో తేల్చేయడం పెద్ద రిలీఫ్. కామెడీ సీన్లు అస్సలు పేలలేదు. ఇంటర్వల్ బ్యాంగ్ మాత్రం చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. గుళ్లో ఫైట్, ఆ తర్వాత విలన్‌కి వార్నింగ్… ఈ సీన్లు ఆడియ‌న్స్‌కి ఉప‌శ‌మ‌నాన్ని ఇస్తాయి.

ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ కూడా అంతే రొటీన్‌గా సాగుతుంది. హీరో, విలన్‌ల మధ్య క్యాట్ అంట్ మౌజ్ గేమ్ ఏమాత్రం ఇంట్రస్టింగ్‌గా ఉండదు. చాలా చప్పగా సాగుతుంది. సాంగ్స్ ప్లేస్‌మెంట్ కూడా కథ ఫ్లోని దెబ్బ తీస్తాయి. ప్రీ-క్లైమ్యాక్స్ ముందు వచ్చే ఎమోషనల్ సీన్, దాని వెంటనే వచ్చే క్లైమ్యాక్స్ యాక్షన్ ఫైట్ ఆకట్టుకుంటాయి. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రుగుతుంది.

జ‌గ‌పతిబాబుని ఈ మ‌ధ్య ప్ర‌తినాయ‌కుడిగానే ఎక్కువ‌గా చూస్తున్నాం. కానీ ఇందులో సెటిల్డ్ యాక్ట‌ర్ గా క‌నిపిస్తూ రాజారామ్ పాత్ర‌లో మెప్పించారు. ఆయ‌న పాత్ర‌ని డిజైన్ చేసిన‌ విధానం బాగుంది. డింపుల్ హ‌యాతి డ్యాన్స్‌లు బాగా చేసింది. ఖుష్బూ పాత్ర ప‌రిధి మేర‌కు న‌టించారు. అలీ, వెన్నెల కిశోర్‌, స‌త్య‌, గెట‌ప్ శ్రీను, స‌ప్త‌గిరి గ్యాంగ్ చేసిన హంగామా ఏమాత్రం న‌వ్వించ‌దు. అయితే యాక్షన్ సీన్ల కోసం థియేటర్లకు వచ్చే గోపిచంద్ అభిమానులు మాత్రం సంతోషిస్తారు.

ప్ల‌స్ పాయింట్స్: గోపిచంద్ యాక్ష‌న్, డింపుల్ డ్యాన్స్‌లు, బీజీఎం

మైన‌స్ పాయింట్స్: క‌థ‌, స్లో న‌రేష‌న్

బాట‌మ్‌లైన్‌: ఈ బాణం గురిత‌ప్పింది.

చిత్ర‌సీమ రేటింగ్: 2/5

ఇంకా చ‌ద‌వండి:  రామ‌బాణం రివ్యూ, రేటింగ్‌

ట్రెండింగ్ వార్తలు