Shekar Movie Review: రాజ‌శేఖ‌ర్ వ‌న్ మ్యాన్ షో..

May 20, 2022

Shekar Movie Review: రాజ‌శేఖ‌ర్ వ‌న్ మ్యాన్ షో..

క‌థ‌: శేఖ‌ర్ (రాజ‌శేఖ‌ర్‌) వాలెంట‌రీ రిటైర్‌మెంట్ తీసుకున్న‌కానిస్టేబుల్. మ‌ర్డ‌ర్‌ కేసుల్ని ఛేదించ‌డంలో ఎక్స్‌ప‌ర్ట్ కావ‌డంతో క్లిష్ట‌మైన కేసులు ఎదురైన ప్ర‌తిసారీ శేఖ‌ర్ స‌హాయాన్నే కోరుతుంటారు పోలీసులు. అలా శేఖ‌ర్ ఛేదించిన కేసుల్ని త‌న ఖాతాలో వేసుకుంటాడు ఆ న‌గ‌ర ఎస్పీ. అనుకోకుండా కాలేజీలో జ‌రిగిన గొడ‌వ‌ల్లో గాయ‌ప‌డి త‌న కూతురు గీత శేఖ‌ర్ (శివాని రాజ‌శేఖ‌ర్‌) బ్రెయిన్ డెడ్ అయి చ‌నిపోతుంది. కొన్నాళ్ల‌కు భార్య ఇందు కూడా రోడ్డు ప్రమాదం భారిన ప‌డి బ్రెయిన్ డెడ్ అయ్యి చ‌నిపోతుంది. అయితే ఘ‌ట‌నా స్థ‌లంలో క‌నిపించిన ఆధారాల్ని బ‌ట్టి త‌న భార్య‌ది ప్ర‌మాదం కాద‌ని ఎవ‌రో హ‌త్య చేశార‌ని శేఖ‌ర్ గుర్తిస్తాడు. మ‌రి ఆ హ‌త్య చేసిందెవ‌రు? అతని కూతురి మృతికి, భార్య మృతికి ఏమైనా లింకు ఉందా? ఉంటే నేర‌స్థుల్ని ప‌ట్టుకోవ‌డానికి శేఖ‌ర్ ఏం చేశాడు? అనేది మిగ‌తా క‌థ‌.

విశ్లేష‌ణ‌: ప్ర‌స్తుతం స‌మాజంలో జరుగుతున్న‌ కొన్ని విషయాలు వెన్నులో వ‌ణుకు పుట్టిస్తాయి. అలాంటి భయం కలిగించే అంశాలతో తెరకెక్కించిన సినిమా శేఖర్‌. అనారోగ్యంతో హాస్పిటల్‌కి వెళ్తున్న వాళ్లు ఎంత వరకు సేఫ్‌? వైద్యం అందించాల్సిన ఆసుపత్రులు సిండికేట్‌గా త‌యార‌య్యి రోగుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాయి? మెడికల్‌ మాఫియా చీకటి కోణాల సంగతులేంటి? ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులే డ‌బ్బుల‌కోసం ఎలాంటి నీచ‌మైన ప‌నులకు ఒడిగ‌డుతున్నారు. ప్ర‌స్తుతం కొన్ని కార్పోరేట్ ఆసుప‌త్రుల‌లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో సవివరంగా చెప్పిన కథ శేఖర్‌. తెలిసిన కథే అయినా, సొసైటీకి మరోసారి తెలియజేయాల్సిన కథ అనే తెగువతో తెరకెక్కించారు జీవిత రాజశేఖర్‌.

2018లో విడుద‌లై విజ‌య‌వంత‌మైన ‘జోసెఫ్‌’కు రీమేక్‌గా రూపొందింది. మాతృక‌తో పోల్చితే తెలుగులో నేటివిటీకి త‌గ్గ‌ట్లుగా చిన్న చిన్న మార్పులు చేసినా.. క‌థ మొత్తం యథాత‌థంగా చూపించే ప్ర‌య‌త్నం చేశారు. ఓ వృద్ధ జంట హ‌త్య‌కు గురి కావడం.. ఆ కేసును ఛేదించేందుకు పోలీసులు శేఖ‌ర్ సహాయం కోర‌డం.. అతను రంగంలోకి దిగి త‌న తెలివితేట‌ల‌తో నిమిషాల వ్య‌వ‌ధిలో నేర‌స్థుల్ని క‌నిపెట్ట‌డం వంటి స‌న్నివేశాల‌తో ఆరంభం చ‌క‌చ‌కా సాగిపోతుంది. ఆ వెంట‌నే శేఖ‌ర్ ఫ్లాష్ బ్యాక్‌ను ప్రారంభించి.. అత‌ని వ్య‌క్తిగ‌త జీవితంలోకి ప్రేక్ష‌కుల్ని తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కురాలు జీవిత‌. తండ్రీకూతుళ్ల అనుబంధాల నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు అక్క‌డ‌క్క‌డా గుండెల్ని హ‌త్తుకుంటాయి. ఇక ఇంట‌ర్వెల్‌కి ముందు ఇందు రోడ్డు ప్ర‌మాదంలో ఇందు చ‌నిపోవ‌డం.. అది ప్ర‌మాదం కాదు హ‌త్య అని శేఖ‌ర్ క‌నిపెట్ట‌డంతో సెకండాఫ్‌లో ఏం జ‌ర‌గ‌బోతుందా? అని ఆస‌క్తి పెరుగుతుంది.

సెకండాఫ్‌ ఆరంభం నుంచే కథలో వేగం పెరుగుతుంది. ఇందు హ‌త్య కేసును ఛేదించే క్ర‌మంలో శేఖ‌ర్ వేసే ఎత్తుగ‌డ‌లు అక్క‌డ‌క్క‌డా కాస్త రొటీన్‌గా అనిపించినా ఆద్యంతం ఉత్కంఠ‌ భ‌రితంగానే సాగుతాయి. బ్రెయిన్ డెడ్ అయిన వ్య‌క్తుల అవ‌య‌వాల‌ను.. జీవ‌న్‌దాన్ వ్య‌వ‌స్థ ద్వారా వైద్య రంగంలోకి కొంద‌రు వ్య‌క్తులు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చెప్పిన తీరు మెప్పిస్తుంది. ప‌తాక స‌న్నివేశాలు గుండెల్ని బ‌రువెక్కిస్తాయి.

మలయాళంతో పోలిస్తే తెలుగులో కథనంలో స్పీడ్‌ కనిపిస్తుంది. ఎమోషన్స్ బాగా పండాయి. రాజశేఖర్‌ చెప్పే ‘అక్కడ కృష్ణుడిని నేనే… ఇక్కడ భీష్ముడిని’ నేనే డైలాగ్‌ బావుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ప్రకాష్‌రాజ్‌ కేరక్టర్‌ చెప్పే ప్రతి మాటలోనూ స్పష్టత కనిపిస్తుంది. ఆ సినిమా మొత్తాన్ని వివరించే ఆ సన్నివేశానికి లాయ‌ర్ బ‌ల‌రామ్‌గా ప్ర‌కాశ్ రాజ్ వంద‌శాతం న్యాయం చేశారు.

శేఖ‌ర్ పాత్ర‌లో రాజ‌శేఖ‌ర్ వ‌న్‌మ్యాన్ షో ఈ సినిమా…వ‌య‌సు పైబ‌డిన వ్య‌క్తిలా ఆయ‌న క‌నిపించిన తీరు.. ప‌లికించిన హ‌వ‌భావాలు చ‌క్క‌గా కుదిరాయి. ఈ చిత్రానికి అన్నీ తానై ముందుకు న‌డిపించారు. ఆత్మీయ రాజ‌న్‌, ముస్కాన్, శివాని, అభిన‌వ్ గోమ‌ఠం త‌దిత‌రులు త‌మ పాత్ర ప‌రిధుల మేర న‌టించారు. అనూప్ రూబెన్స్ స్వ‌ర‌ప‌రిచిన‌ నేప‌థ్య సంగీతం ఆద్యంతం మెప్పిస్తుంది. మ‌ల్లికార్జున్ త‌న ఛాయాగ్రహ‌ణంతో అర‌కు అందాల్ని త‌న కెమెరాలో చ‌క్క‌గా ఒడిసిప‌ట్టారు. నిర్మాణ విలువ‌లు క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి. మెత్తానికి థ్రిల్ల‌ర్ సినిమాలు ఇష్ట‌ప‌డే వ్య‌క్తుల‌కు విప‌రీతంగా న‌చ్చుతుంది.

Chitraseema Rating : 2.75/5

ట్రెండింగ్ వార్తలు