నాగ‌శౌర్య ల‌క్ష్య రివ్యూ అండ్ రేటింగ్‌

December 10, 2021

నాగ‌శౌర్య ల‌క్ష్య రివ్యూ అండ్ రేటింగ్‌

రివ్యూ: లక్ష్య ప్రధాన తారాగణం: నాగశౌర్య, కేతికా శర్మ, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్, రవిప్రకాష్ తదితరులు ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ కెమెరా: రామ్ మాటలు: సృజనామణి సంగీతం: కాలభైరవ నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి విడుదల తేదీ: 10-12-2021

రీసెంట్‌గా వ‌రుడు కావలెను సినిమాతో ప‌ల‌క‌రించాడు నాగ‌శౌర్య‌. ఆ సినిమాలో నాగ‌శౌర్య న‌ట‌న‌కు మంచి మార్కులే పడ్డాయి. ఒక నెల గ్యాప్‌లో మ‌ళ్లీ లక్ష్య అనే స్పోర్ట్స్ బేస్ట్డ్ డ్రామాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా కోసం నాగ‌శౌర్య‌ ఎయిట్‌ప్యాక్ బాడీ తో క‌నిపించ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలే ఏర్ప‌డ్డాయి. సుమంత్‌తో సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం సినిమా తీసిన సంతోష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. రొమాంటిక్ సినిమా ఫేమ్ కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. శరత్ మరార్, నారాయణ్ దాస్ నారంగ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. డిసెంబ‌రు 10న ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌చ్చిన లక్ష్య లక్ష్యాన్ని చేరిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ: వాసు(రవిప్రకాష్) ఆర్చరీ ప్లేయర్. వరల్డ్ ఛాంపియన్ కావాలనేది అతడి లక్ష్యం. ఆర్చరీ పోటీలకు వెళ్తుండగా… యాక్సిడెంట్ లో మరణిస్తాడు. దాంతో వాసు కొడుకు పార్ధు(నాగ‌శౌర్య‌)ను వాళ్ల తాతయ్య రఘురామయ్య(సచిన్ ఖేడేకర్) పెంచి పెద్ద చేస్తాడు. అయితే చిన్న‌త‌నంలోనే త‌న తండ్రి వాసు గురి పార్ధుకు రావ‌డాన్ని రఘురామ‌య్య గుర్తిస్తాడు. దాంతో పార్ధుని ఎలాగైనా నేష‌న‌ల్ ప్లేయ‌ర్ చేయాల‌ని ఆస్తులు అన్నీ అమ్మి మనవడికి శిక్షణ ఇప్పిస్తాడు. పార్ధు కూడా కష్టపడి ఆడి…స్టేట్ లెవల్ ఛాంపియన్ అవుతాడు. ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్ ట్రయల్స్ కి సన్నద్ధం అయ్యే సమయంలో తాతయ్య మరణించడంతో బాధలో… ఆటలో గెలవడం కోసం మత్తు పదార్థాలకు బానిస అవుతాడు. అది తెలిసి అకాడమీ అతడిని సస్పెండ్ చేస్తుంది. అసలు, పార్ధు మత్తుకు బానిస కావడానికి కారణం ఎవరు? మరణించాలని రోడ్డు మీద వస్తున్న లారీకి అడ్డంగా వెళ్లిన పార్థును కాపాడిన సారథి (జగపతి బాబు) ఎవరు? పార్ధు జీవితంలో రితికా (కేతికా శర్మ) పాత్ర ఏమిటి? మళ్లీ పార్ధు ఆర్చరీకి దగరయ్యి అతడిని వరల్డ్ ఛాంపియన్ గా చూడాలనుకున్న తాతయ్య కోరికను నెరవేర్చాడా? లేదా? అనేది మిగతా సినిమా.

విశ్లేషణ: సినిమా కోసం నాగశౌర్య చాలా కష్టపడ్డారు. ఎయిట్ ప్యాక్ చేశారు… కాని కొన్ని ఎమోష‌న‌ల్ సీన్ల‌లో ఇంకాస్త బాగా పెర్‌ఫామ్ చేస్తే బాగుండు అనిపించింది. ఆర్చరీ అనేది ఇండియా గేమ్. ఆట‌కు ప్రాధాన్య‌త క‌లిపించాల‌నే ద‌ర్శ‌కుడి ఆలోచ‌న బాగుంది. కాని క‌థ‌లో ఎక్కువ డ్రామా ఉండ‌డం వ‌ల్ల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ కొత్తగా ఏమీ సాగదు. ప్రేక్షకుల ఊహకు అనుగుణంగా సినిమా సాగుతుంది. పాత్ర‌లు బ‌లంగా లేక‌పోవ‌డం వ‌ల్ల స‌చిన్ ఖేడ్‌క‌ర్‌, జ‌గ‌ప‌తిబాబు లాంటి యాక్ట‌ర్స్ ఉన్నా సినిమా చ‌ప్ప‌గానే సాగుతుంది. సెంటిమెంట్‌ వ‌ర‌కు ఓకే..స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కాన్సెప్ట్ ఉంది. మత్తు (డ్రగ్స్)కు బానిస అయ్యి మళ్లీ పైకి లేచిన మనిషి ధృడ సంకల్పం ఉంది. లవ్ కూడా ఉంది. అయితే… వీటిని కరెక్టుగా కనెక్ట్ చేసే స్క్రీన్ ప్లే మిస్ అయింది. సన్నివేశాల్లో ఎమోషన్ మిస్ అయింది. కథతో ప్రేక్షకుడిని కనెక్ట్ చేసే డైరెక్షన్ మిస్ అయింది. అందువల్ల, ఫస్టాప్ అంతా సోల్ లెస్సినిమా చూసినట్టు ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత… పార్ధు కింద పడి, అక్కడ నుంచి పైకి లేచిన తర్వాత వచ్చే సీన్స్ పడిన సినిమాను కొంత నిలబెట్టాయి. మళ్లీ పతాక సన్నివేశాలు చప్పగా సాగాయి. నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ సోసోగా ఉన్నాయి. సంగీత దర్శకుడు కాలభైరవకు ఎక్కువ పాటలు చేసే అవకాశం రాలేదు. రెండు పాటలు ఉన్నాయి. అయితే… థియేటర్ నుంచి బయటకు వచ్చాక గుర్తుండవు. గతంలో కాల భైరవ మంచి స్వరాలు అందించారు. అతడి నుండి హిట్ సాంగ్స్ తీసుకోవడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్టు ఉంది.

ముందు చెప్పినట్టు నాగశౌర్య సినిమా కోసం చాలా కష్టపడ్డారు. పాత్రకు న్యాయం చేశారు. భరత్ రెడ్డి, శత్రు, ‘స్వామి రారా’ సత్య, కిరీటి తదితరులు పాత్రలకు తగ్గట్టు నటించారు. నాగశౌర్య, సచిన్ ఖేడేకర్, జగపతిబాబు బాగా చేసినా… కథ, కథనం, దర్శకత్వం వల్ల సినిమా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే….బాణాన్ని దర్శకుడు సరిగ్గా వదల్లేదు…

బాట‌మ్ లైన్‌: లక్ష్యాన్ని చేరుకోలేక పోయిన ల‌క్ష్య.

చిత్ర‌సీమ రేటింగ్‌: 2/5

ట్రెండింగ్ వార్తలు