తాప్సీ `మిష‌న్ ఇంపాజిబుల్` రివ్యూ అండ్ రేటింగ్‌

April 1, 2022

తాప్సీ `మిష‌న్ ఇంపాజిబుల్` రివ్యూ అండ్ రేటింగ్‌

నటీనటులు: తాప్సీ పన్ను, హర్ష్ రోషన్, భాను ప్రకాష్, జయతీర్థ మొలుగు, హరీష్ పెరడి, రవీంద్ర విజయ్ తదితరులు

చిత్రం: మిషన్ ఇంపాజిబుల్ నటీనటులు: తాప్సీ పన్ను, హర్ష్ రోషన్, హర్ష వర్ధన్, భాను ప్రకాశన్, హరీష్ పెరాడి, వైవ హర్ష, సుహస్, సత్యం రాజేష్ తదితరులు సంగీతం: మార్క్ కే రాబిన్ సినిమాటోగ్రఫీ: ఎస్ మనికందన్ నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి దర్శకత్వం: స్వరూప్ అర్ ఎస్ జే బ్యానర్: మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, పీ ఏ ఎంటర్టైన్మెంట్ విడుదల తేది: 01/04/2022

2019 లో వ‌చ్చిన “గేమ్ ఓవర్” సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన తాప్సీ పన్ను గత కొంత కాలంగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండి తెలుగు సినిమాలు చేయ‌లేదు. తాజాగా ఇప్పుడు తాప్సీ “మిషన్ ఇంపాజిబుల్” అంటూ మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ” సినిమాతో మంచి హిట్ అందుకున్న స్వరూప్ ఆర్ ఎస్ జె ఈ సినిమాకి దర్శకత్వం వహించ‌డం, ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా ఉండ‌డంతో సినిమాపై పాజిటివ్ బ‌జ్ క్రియేట్ అయింది. 2014 లో పాట్నా లో జరిగిన కొన్ని నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం.

కథ‌: సినిమా ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ శైలజ (తాప్సీ) తో మొదలవుతుంది. ఒక రాజకీయ నాయకుడిని పదవి నుంచి దింపేసిన ఆమె తన నెక్స్ట్ మిషన్ ను మొదలుపెడుతుంది. తన కూతురు అపహరణకు గురైన కేసులో ఇన్వెస్టిగేషన్ కోసం విక్రమ్ (రవీంద్ర విజయ్) శైలజ సహాయం కోరతాడు. కిడ్నాప్ అయ్యాక తన కూతురును ఎన్ని హింసలు పెట్టారో చెప్పాక శైలజ కూడా అతనికి సాయం చేసేందుకు సిద్ధమవుతుంది. వీళ్లకు ఎస్ ఐ సతీష్ తోడవుతాడు. పిల్లలను దుబాయ్ కు అక్రమ రవాణా చేస్తున్న రామ్ శెట్టి (హరీష్ పెరడి) ఆట కట్టించడాన్ని తర్వాత మిషన్ గా పెట్టుకుంటారు శైలజ, విక్రమ్, సతీష్. వీరికి తిరుపతి ద‌గ్గ‌ర‌లోని వడమాలపేట గ్రామంలో ఉండే ముగ్గురు పిల్లలు రఘుపతి (సినిమా), రాఘవ (టీవీ షో) మరియు రాజారామ్ (క్రికెట్) తార‌స‌ప‌డ‌తారు. ఎలాగైనా దావూద్ ఇబ్రహీం ని పట్టుకొని యాభై లక్షల రివార్డు డబ్బులు చేజిక్కించుకోవాలని ఆ ముగ్గురు ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు. కేవలం పది పన్నెండేళ్ళు ఉన్న ఆ ముగ్గురు పిల్లల స‌హాయంతో ఒక‌ మాఫియాడాన్ రామ్ శెట్టి చేసే చైల్డ్ ట్రాఫికింగ్ ను ఆపాలని శైలజ నిర్ణయించుకుంటుంది. మరి వారి మిషన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే

ఫ్లస్ పాయింట్స్

తాప్సీ నటన ముగ్గురు పిల్లల పర్మార్మెన్స్ నవ్వించే సంభాషణలు స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్

ఫ‌స్టాప్ లో బ‌ల‌మైన స‌న్నివేశాలు లేక‌పోవ‌డం.

పిల్లల అక్రమ రవాణా అంశాన్ని నేపథ్యంగా ఎంచుకుని ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్ జే. ముగ్గురు పిల్లల సాహసోపేత ఆలోచనలు, వాళ్ల అమాయకత్వం, ప్రదర్శించే ధైర్యం…వీటన్నింటినీ కలిపి సినిమాలో వినోదాన్ని పండించే ప్రయత్నం చేశారు. వీళ్ల సరదా మాటలు, చేష్టలతోనే తొలి భాగం సినిమా ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. మరోవైపు నేరస్తుల ఆట కట్టించేందుకు తాప్సీ, రవీంద్ర విజయ్ బృందం చేసే ఇన్వెస్టిగేషన్, వేసే ప్లాన్ లు ఆసక్తి కలిగిస్తాయి. ఈ రెండు బృందాలు కలిసే చోట ఒక ఆసక్తికర మలుపుతో సినిమా తొలి అర్థభాగం ముగుస్తుంది. ద్వితీయార్థంలో దీనికి కొనసాగింపుగా అనేక ట్విస్టులతో కథను క్లైమాక్స్ దాకా తీసుకెళ్లారు. జర్నలిస్ట్ శైలజ పాత్రలో తాప్సీ నటన ఆకట్టుకుంటుంది. పిల్లల్ని కాపాడేందుకు ప్రయత్నించే యువతిగా ఆమె మెప్పించింది. కూతురు కోసం, అలాంటి మిగతా పిల్లల కోసం మిషన్ లో పాల్గొనే విక్రమ్ క్యారెక్టర్ లో రవీంద్ర విజయ్ సహజంగా కనిపించారు. ముగ్గురు పిల్లలు రఘుపతి, రాఘవ, రాజారాం పాత్రల్లా మారిపోయారు. ఈ పాత్రల్లో వీళ్లు ప్రదర్శించిన నటన, చెప్పిన డైలాగ్స్ నవ్వులు పూయించాయి.

మార్క్ కె రాబిన్ సంగీతం సినిమాకు ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఏద్దా గాలం, చేసేద్దాం గందరగోళం ఆకట్టుకుంది. నేపథ్య సంగీతం కూడా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. సినిమాలో ప్రేక్షకులను ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది. సినిమాటోగ్రఫీ బ్రైట్ గా, ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉన్నాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా తర్వాత దాదాపు అలాంటి కథనే ఎంచుకున్న దర్శకుడు స్వరూప్…రెండో చిత్రానికీ పూర్తి బాధ్యతగా, జాగ్రత్తగా సినిమాను తెరకెక్కించారు. గత చిత్రం తాలుకూ ఛాయలు కనిపించినా, పిల్లల అక్రమ రవాణా అంశం కాబట్టి ప్రేక్షకులకు సినిమా మీద సింపథీ కలుగుతుంది. అదే సమయంలో పిల్లలతో తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలు మనసును ఇబ్బంది పెడతాయి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. మొదట 30 నిమిషాలు సినిమా బాగానే ఉన్నప్పటికీ తరువాత స్క్రీన్ ప్లే సీరియస్ టోన్ లోకి మారుతుంది. ఇక సెకండాఫ్ లో వచ్చే కొన్ని సస్పెన్స్ సన్నివేశాలు బాగానే ఆకట్టుకున్నాయి. ముగ్గురు పిల్లల నటన, డైలాగ్ డెలివరీ, సినిమాకి అతి పెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. చివరిగా “మిషన్ ఇంపాజిబుల్” సినిమా కేవలం కొన్ని సన్నివేశాలతో మాత్రమే ఆకట్టుకునే ఒక యావరేజ్ కామెడీ థ్రిల్లర్.

బాట‌మ్ లైన్‌: మిష‌న్ ఆఫ్ స‌క్సెస్‌ఫుల్‌

చిత్ర‌సీమ రేటింగ్ : 2.5/ 5

Read more:

Related News

ట్రెండింగ్ వార్తలు