Keerthy Suresh: గుడ్ ల‌క్ స‌ఖి రివ్యూ అండ్ రేటింగ్‌

January 28, 2022

Keerthy Suresh: గుడ్ ల‌క్ స‌ఖి రివ్యూ అండ్ రేటింగ్‌

చిత్రం: గుడ్‌ల‌క్ స‌ఖి

విడుద‌ల తేధి: 28-01-2022

తారాగణం- కీర్తి సురేష్‌, ఆది పినిశెట్టి, జగపతి బాబు తదితరులు

ద‌ర్శ‌క‌త్వం: నగేష్ కుకునూర్

స‌మ‌ర్ప‌ణ‌: దిల్ రాజు

నిర్మాత‌: సుధీర్ చంద్ర ప‌దిరి

కో ప్రొడ్యూస‌ర్‌: శ్రావ్య వర్మ

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

సినిమాటోగ్ర‌ఫి: చిరంతాన్ దాస్

మహానటి సావిత్రి పాత్ర‌లో అద్భుతంగా న‌టించి ఆ సినిమాతో ఇండ‌స్ట్రీ దృష్టిని త‌న‌వైపు తిప్పుకోవ‌డంతో పాటు జాతీయ అవార్డుని ద‌క్కించుకుంది కీర్తి సురేష్. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిల‌వ‌లేదు.. మ‌హాన‌టి సినిమా సాధించిన విజ‌యం కార‌ణం చూపించి కీర్తి అంత‌కు ముందు ఒప్పుకున్న పెంగ్విన్ చిత్రాన్ని అమేజాన్‌కు భారీ రేటుకు అప్ప‌జెప్పారు నిర్మాత‌లు. అయితే నిర్మాత‌ల‌కు ఆ సినిమా భారీ లాభాల‌ను తెచ్చినా కీర్తి సురేష్ న‌ట‌న‌కు ఏమాత్రం మార్కులు ప‌డ‌లేదు. అదే ఊపులో మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి లాంటి ఉమెన్ సెంట్రిక్‌ మూవీస్‌ చేసింది. అందులో మిస్ ఇండియా చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లైంది. ఫ‌స్టాఫ్ వ‌ర‌కూ ప‌ర్వాలేద‌నిపించినా సెకండాఫ్ చూసి పెద‌వివిరిచారు ప్రేక్ష‌కులు. దాంతో మ‌రో చిత్రం గుడ్‌ల‌క్ స‌ఖీకి అంతా బ్యాడ్‌ల‌క్ స్టార్ట‌య్యింది. సినిమా మొద‌లుపెట్టి మూడేళ్లు దాటిన ఎప్ప‌డు విడుద‌ల‌వుతుందో తెలీని ప‌రిస్థితి. ఈ క‌రోనా కాలంలో ధైర్యం చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన‌ప్ప‌టికీ వాయిదా వేయ‌క త‌ప్పలేదు. అయితే సంక్రాంతి సినిమాలు బాగానే క‌లెక్ట్ చేయ‌డంతో మ‌రోసారి ధైర్యం చేసి జ‌న‌వ‌రి28న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చారు మేక‌ర్స్‌. అయితే టైటిల్‌కు తగినట్లుగానే కీర్తి సురేష్‌కు ఈ సినిమా అదృష్టాన్ని తెచ్చిపెట్టిందా? చాలా రోజుల త‌ర్వాత తెలుగులో ఆమెకు విజయం దక్కిందా? లేదా? అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే.

రాయలసీమలోని ఓ పల్లెటూరి కి చెందిన యువతి సఖి(కీర్తి సురేష్). ఆ ఊరి వారందరూ ఆమెను దురదృష్టవoతురాలిగా భావిస్తుంటారు. ఆమె ఎదురొస్తే ఏ పనీ జరగదని, త‌న‌ దురదృష్టం కారణంగా ఆమెకు వచ్చే పెళ్లి సంబంధాలు చెడిపోతున్నాయ‌ని ప్ర‌జ‌లు న‌మ్ముతుంటారు. అదే ఊర్లో నాట‌కాలు వేసుకునే గోలి రాజు (ఆది పినిశెట్టి), స‌ఖి మంచి స్నేహితులు. చిన్న‌ప‌టి నుండి స‌ఖి గురిపై రాజుకు మ‌హా న‌మ్మ‌కం. దాంతో దేశం గ‌ర్వ‌ప‌డేలా మంచి షూట‌ర్స్‌ను త‌యారు చేయాల‌న్న‌ది క‌ల‌తో ఆ ఊర్లో అడుగు పెట్టిన‌ రిటైర్డ్‌ ఆర్మీ కల్నల్ (జ‌గ‌ప‌తిబాబు) దృష్టిలో స‌ఖి ప‌డేలా చేస్తాడు. గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించగల ప్ర‌తిభ‌ను చూసి ఆమెకు షూటింగ్ క్రీడలో శిక్షణ ఇస్తాడు.అయితే ఈ ఆటలో పైకి ఎదిగే క్ర‌మంలో స‌ఖికి ఎదురైన స‌వాళ్లేంటి? వాట‌న్నింటినీ దాటుకుని ఎలా విజ‌యం సాధించింది? త‌న పేరును గుడ్ ల‌క్ స‌ఖిగా ఎలా మార్చుకుంది? స‌ఖి – గోలిరాజుల ప్రేమ‌క‌థ ఏమైంది? అన్న‌ది తెర‌పై చూడాలి.

క్రీడా నేప‌థ్య చిత్రాలు తెలుగులో కొత్తేమీ కాదు. క‌బ‌డ్డీ, క్రికెట్‌తో పాటు ప‌లు క్రీడాంశాల‌తో రూపొందిన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద చ‌క్క‌టి విజ‌యాల్ని అందుకున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాల‌ ప‌ట్ల యువ‌త‌రంలో క్రేజ్ ఉండ‌టం, తెలుగు తెర‌పై ఇప్ప‌టి వ‌ర‌కూ షూటింగ్ నేప‌థ్యంలో సినిమాలు పెద్ద‌గా రాక‌పోవ‌డంతో ఈ సినిమా ఒప్పుకున్న‌ట్టుంది కీర్తి సురేష్‌. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల్ని రెండున్న‌ర గంట‌లు థియేట‌ర్స్‌లో కూర్చోబెట్ట‌డం నిజంగా క‌త్తిమీద సాము లాంటిది. స్పోర్ట్స్ నేప‌థ్యంలో ఎన్నో సినిమాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ చెక్‌దే ఇండియా, దంగ‌ల్‌, సుల్తాన్‌, ఎమ్ ఎస్ ధోని లాంటి కొన్ని చిత్రాలు మాత్ర‌మే ప్రేక్ష‌కుల మ‌న్న‌ల‌నుపొంద‌గ‌లిగాయి. బాలీవుడ్ చిత్రాల‌తో జాతీయ స్థాయిలో ప్ర‌తిభ‌ను చాటిన ఆయ‌న‌కు తెలుగులో మాత్రం త‌న ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయారు. సాధారణంగా క్రీడానేపథ్య చిత్రాల్లో క్లైమాక్స్‌ ఊహించేదిగానే ఉంటుంది. ఈ సినిమాల్లో ఎన్ని అడ్డంకులు ఎదురైనా అంతిమంగా ప్ర‌ధాన పాత్ర‌ధారే విజయాల్ని అందుకుంటారు. వారికి ఎదురయ్యే అవరోధాలను ఉత్కంఠభరితంగా చక్కటి భావోద్వేగాల మేళవింపుతో తెర‌పై చూపించ‌గ‌లిగిన‌ప్పుడే ఈ స్పోర్ట్ డ్రామా సినిమాలు వర్కవుట్ అవుతాయి. తెలిసిన కథనే కొత్తగా చెప్పే నేర్పు దర్శకులకు ఉండాలి. ఆ విషయంలో నగేష్ కుకునూర్ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. ఎంతో సీరియ‌స్‌గా సాగాల్సిన షూటింగ్ ట్రైనింగ్ స‌న్నివేశాలు కామెడీగా సాగుతాయి. క‌ల్న‌ల్, స‌ఖికి ఉన్న అనుబంధాన్ని రాజు అపార్థం చేసుకోవ‌డాన్ని భావోద్వేగ‌భ‌రితంగా తీర్చిదిద్ద‌లేక‌పోయారు. క‌ల్న‌ల్ ప‌ట్ల స‌ఖికి ఉన్న‌ది ప్రేమా, గౌర‌వ‌మా అనే విషయంలో రాజుతో పాటు స‌గ‌టు ప్రేక్షకుల్ని కూడా క‌న్ఫ్యూజ‌న్ చేశాడు ద‌ర్శ‌కుడు. క్లైమాక్స్ ఏంత‌మాత్ర‌ము క‌న్వీన్సింగ్‌గా ఉండ‌దు.

బంజారా యువ‌తిగా, షూటింగ్ క్రీడాకారిణిగా భిన్న పార్శాల‌తో కూడిన పాత్ర‌లో కీర్తిసురేష్ స‌హ‌జ‌ న‌ట‌న‌ను క‌న‌బ‌రించింది. మ‌న‌సులో అంతులేని బాధ ఉన్నా పైకి మాత్రం హుషారుగా క‌నిపించే యువ‌తిగా స‌ఖి పాత్ర‌లో పూర్తిగా ఒదిగిపోయింది. స‌ఖి పాత్ర‌కు త‌గిన‌ట్లుగా త‌న‌ను తాను మ‌లుచుకున్న తీరు బాగుంది. క్యారెక్ట‌ర్ కోసం తానే సొంతంగా డ‌బ్బింగ్ చెప్పింది. ద‌ర్శ‌కుడి త‌ప్పిదాల కార‌ణంగా ఆమె క‌ష్టం మొత్తం వృథాగానే మిగిలిపోయింది దాంతో ఈ సినిమా బిలో యావ‌రేజ్‌గానే మిగిలింది. కీర్తి సురేష్ ప‌డ్డ క‌ష్టంకోసం ఒక‌సారి సినిమా చూడొచ్చు.

బాట‌మ్ లైన్: బోరింగ్ స‌ఖి రేటింగ్‌: 2 /5

ట్రెండింగ్ వార్తలు