అనుభ‌వించు రాజా రివ్యూ అండ్ రేటింగ్‌

November 26, 2021

అనుభ‌వించు రాజా రివ్యూ అండ్ రేటింగ్‌

సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమాతో రాజ్ తరుణ్, దర్శకుడు శ్రీను గవిరెడ్డి ఒక ప్రయత్నం చేశారు. కాని అది ప్రేక్ష‌కుల‌ని పూర్తిగా నిరాశ‌ప‌రిచింది. దాదాపు ఐదేళ్ల తర్వాత మ‌ళ్లీ ఇప్పుడు ఇదే కాంబినేష‌న్లో అనుభవించు రాజా అంటూ వచ్చారు. ఈ సారి పూర్తిగా భీమవరం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి ప‌తాకాల‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాగైనా హిట్ కొట్టాల‌ని న‌వంబ‌రు 26న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమాతో రాజ్ త‌రుణ్ స‌క్సెస్ సాధించాడా లేదా ఇప్పుడు చూద్దాం.

క‌థ‌: బంగారం అలియాస్ రాజు(రాజ్ త‌రుణ్)త‌న తాత చివ‌రి వ‌ర‌కూ సంపాద‌న‌కే ప‌రిమిత‌మై త‌నకంటూ జ్ఞాప‌కాలేమీ లేకుండా త‌నువు చాలిస్తాడు. తన చివ‌రి క్షణాల్లో నువ్వైనా బాగా అనుభ‌వించు అని మ‌న‌వ‌డికి చెప్పి ప్రాణాలు వదిలేస్తాడు అయితే తాత‌ సంపాదించిన ఆస్తితో జీవితాన్ని సంతోషంగా గ‌డుపుతుంటాడు. ఆ ఊరికి ప్ర‌సిడెంట్ అవ్వాల‌నే ప్ర‌య‌త్నంలో జ‌రిగిన‌ ఒక త‌ప్పు వ‌ల్ల కొంత కాలం జైలుకి వెళ్లాల్సి వ‌స్తుంది. బెయిల్‌పై విడుద‌లై హైద‌రాబాద్‌లోని ఓ ఐటీ కంపెనీలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం చేస్తుంటాడు. అదే కంపెనీలో ఉద్యోగం చేసే అమ్మాయితో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఇంతలో సుఫారీ తీసుకుని కృరంగా హ‌త్య‌లు చేసే గ్యాంగ్ రాజుని చంపాల‌ని ప్లాన్ చేస్తుంది. వారి నుండి బ‌య‌ట‌ప‌డి రాజు త‌న ప్రేమ‌ను ద‌క్కించుకున్నాడా? అస‌లు రాజు జైలుకి ఎందుకు వెళ్లాల్సి వ‌చ్చింది. త‌న‌ని చంపాల‌ని చూసే గ్యాంగ్‌తో రాజుకు సంబంధం ఏంటి? అనేది మిగ‌తా క‌థ‌.

భీమ‌వ‌రంలోని ఒక గ్రామం ఆ గ్రామంలోని కొన్ని కుటుంబాల‌తో ముడిప‌డిన క‌థ ఇది. కామెడీ, డ్రామాకి ఎక్కువ అవ‌కాశం ఉండే విధంగానే క‌థ‌ రాసుకున్నారు ద‌ర్శకుడు. ఫ‌స్టాఫ్ మొత్తం హైద‌రాబాద్‌, సెకండాఫ్ భీమ‌వ‌రం బ్యాక్‌డ్రాప్లో ఈ క‌థ సాగుతుంది. జైలు నుండి విడుద‌లైన త‌ర్వాత హీరో సెక్యూరిటీ గార్డ్‌గా చేర‌డం, అక్కడ హీరోయిన్‌తో ప‌రిచయం కావ‌డం, ఆ త‌ర్వాత ఇద్దరి మ‌ధ్య ప్రేమ పుట్టడం వంటి స‌న్నివేశాల‌తో సినిమాని స‌ర‌దాగా న‌డిపే ప్రయ‌త్నం చేశారు. కానీ, ఆ స‌న్నివేశాలు అంత బ‌లంగా ఉండ‌క‌పోవ‌డంతో సోసోగా సాగుతుంది. అలాంటి టైమ్‌లో ఇంట‌ర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్ పై కొంత ఆస‌క్తిని క్రియేట్ చేస్తుంది. అయితే సెకండాఫ్లో కూడా బ‌ల‌మైన స‌న్నివేశాలు లేక‌పోవ‌డంతో పేల‌వంగా సాగుతుంది. ఎంతో కీల‌క‌మైన క్లైమాక్స్ కూడా ఎదో చుట్టేసిన‌ట్టు అనిపిస్తుంది.

రాజ్‌త‌రుణ్ లాంటి హీరోకు ఇది ప‌ర్‌ఫెక్ట్ స‌బ్జెక్ట్ అయిన‌ప్ప‌టికీ ఎక్క‌డా ఆ హుశారు క‌నిపించ‌దు. జ‌ల్సారాయుడిలా చేసిన అల్లరి అక్క‌డ‌క్క‌డా ఆక‌ట్టుకుంటుంది. ఎమోష‌నల్ సీన్ల‌లో మాత్రం బ‌ల‌వంతంగా న‌టించాడు అనిపిస్తుంది. హీరోయిన్ కౌశిష్‌ఖాన్ న‌ట‌న ప‌రంగా మ‌రింత ప‌రిణితి చెందాల్సిన అవ‌స‌రం ఉన్నప్పటికీ కొన్ని స‌న్నివేశాలు, పాట‌ల‌లో త‌న గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంటుంది. ఇక ద్వితియార్ధంలో అరియాన క‌నిపించిన‌ప్ప‌టికీ ఆమె పాత్ర‌కు అంత స్కోప్ ఉండ‌దు. సినిమాటోగ్రఫి బాగుంది. పాట‌లు అలా వ‌చ్చి వెళ్తుంటాయి త‌ప్ప గ‌ర్తుంచుకునే విధంగా ఉండ‌వు. బ‌ల‌మైన క‌థ రాసుకున్న‌ప్ప‌టికీ దానికి తెర‌మీద ఆవిష్క‌రించే ప్ర‌యత్నంలో కొన్ని త‌ప్ప‌ట‌డుగులు వేశాడు ద‌ర్శ‌కుడు. సుద‌ర్శ‌న్ కామెడి కొంత వ‌ర‌కు నవ్వు తెప్పిస్తుంది. అజ‌య్ మ‌రోసారి మంచి పాత్ర‌లో క‌నిపించాడు. అంత‌ర్లీనంగా ఊరి గురించి, జల్సాల గురించి, కుటుంబ బంధాల గురించి చెప్పిన సందేశం ఆక‌ట్టుకున్న‌ప్ప‌టికీ ఆస‌క్తి క‌ర‌మైన క‌థ‌నం లేక‌పోవ‌డం, కామెడీ స‌న్నివేశాలు పండ‌క‌పోవ‌డం సినిమాకు మైన‌స్‌.

బాట‌మ్ లైన్ : భ‌రించాల్సిన రాజా రేటింగ్: 2.25/5

ట్రెండింగ్ వార్తలు