September 10, 2021
ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన భారీ స్పోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామా ‘సీటీమార్’. మిల్కీబ్యూటీ తమన్నా, దిగంగన సూర్యవంశి హీరోయిన్స్ గా నటించారు. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిన తర్వాత క్రమంగా సినిమాలు థియేటర్స్‌లో విడుదలవుతున్నాయి. ఇప్పటికే చాలా వరకు సినిమాలు ప్రేక్షకుడికి ముందుకు వచ్చినా, పక్కా మాస్ అండ్ కమర్షియల్ మూవీ రాలేదనే భావన ఉండిపోయింది. ఇలాంటి సమయంలో వినాయక ఛవితి కానుకగా ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజైంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
రాజమండ్రికి సమీపంలోని గ్రామం కడియం. అక్కడ ఆంధ్రాబ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసే కార్తి(గోపీచంద్).. తన తండ్రి ప్రారంభించిన రామకృష్ణ మెమోరియల్ స్కూల్‌లో అమ్మాయిలకు కబడ్డీలో ట్రైనింగ్ ఇస్తుంటాడు. స్కూల్‌లో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండటంతో ప్రభుత్వం స్కూల్‌ను మూసేయాలని అనుకుంటూ ఉంటుంది. హైస్కూల్ నిర్వహణకు నిధులు లేకపోవడంతో ఓ కార్పోరేట్ సంస్థ దాన్ని దక్కించుకోవాలని ప్లాన్ వేస్తుంది. ఆ స్కూల్‌లోని అమ్మాయిలను నేషనల్ లెవెల్ కబడ్డీ ఛాంపియన్స్ గా నిలబెట్టి, తద్వారా తమ ఊరికి, ఆ స్కూల్ కు గుర్తింపు తీసుకురావాలన్నది కార్తిక్ లక్ష్యం. అందుకోసం ఆ అమ్మాయిలకు ట్రైనింగ్ ఇచ్చి వారికి ఏ హాని రానీయనని, ఓ అన్నలా అండగా నిలబడతానని మాట ఇచ్చి టీమ్‌తో సహా ఢిల్లీ వెళతాడు. అక్కడ ఆ టీమ్‌ను కొందరు రౌడిలు కిడ్నాప్ చేస్తారు. అసలు ఆ రౌడిలు ఎవరు? ఆ టీమ్‌ను ఎందుకు కిడ్నాప్ చేశారు? వారి నుండి తన టీమ్‌ని విడిపించి ఎలా ఫైనల్స్ లో గెలిపించాడు అనేది కథాంశం.
సాధారణంగా తెలుగులో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు రావడం చాలా తక్కువ. అందులోనూ కబడ్డీ నేపథ్యంలో ఇంకా తక్కువ. ఈ తరుణంలో దర్శకుడు సంపత్ నంది, ఉమెన్ కబడ్డీ గేమ్‌ను బేస్ చేసుకుని పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ‘సీటీమార్’ సినిమాను తెరకెక్కించాడు. అమ్మాయిల అన్ని రంగాల్లో ముందడుగు వేయాలి. ముఖ్యంగా స్పోర్ట్స్ విషయంలో అనే విషయాన్ని ఒక పక్క టచ్ చేస్తూనే కమర్షియల్ అంశాలను మేళవించాడు దర్శకుడు సంపత్ నంది. గోపీచంద్‌కు యాక్షన్ హీరో అనే ఓ ఇమేజ్ ఉంది. తన ఇమేజ్‌కు తగ్గట్లు హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ ఫైట్స్, పాటలను మిక్స్ చేసి సినిమాను రూపొందించారు.
‘మన దేశంలో అమ్మాలు వేసుకునే డ్రెస్ సైజ్‌ను బట్టి క్యారెక్టర్ డిసైడ్ అయిపోతుంది’
‘మన దేశంలో మగవాళ్లు అరవై ఏళ్లు బతుకి చనిపోతున్నారు. ఆడవాళ్లు కూడా అరవై ఏళ్లు బ్రతుకుతారు కాని సమాజం వాళ్లని ఇరవై ఏళ్లకే చంపేస్తుంది’ వంటి డైలాగ్స్ సన్నివేశాలకు బలాన్నిస్తే ఫెయిర్ అండ్ లవ్ లీ వాడే అమ్మాయిలే ఫెయిర్ గా ఉండడం లేదు. మెన్షన్ హోస్ తాగే మనమెందుకు మనుషుల్లా ఉండాలి
లాంటి డైలాగ్స్ ఆడియన్స్ చేత నవ్వులు పూయించాయి. ఫస్టాఫ్‌లో హీరో టీమ్ ఫైనల్స్ వరకు చేరుకుంటుంది. ఇంకేం ఉండబోతుంది కథ అనుకుంటే, అక్కడే చిన్న టర్నింగ్ పాయింట్ తీసుకుంటుంది. అయితే ద్వితీయార్థంలో కథనం పూర్తిగా స్లో అవుతుంది. హీరో – హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ బలంగా ఉండదు. జాతీయ స్థాయి పోటీలకి వెళ్లిన ఓ రాష్ట్ర జట్టు కిడ్నాప్‌కి గురయితే, అది బయటికి పొక్కకుండా ఉండటం, ఆ జట్టు కోసం కోచ్ ఒక్కడే పోరాడటం అనేది లాజిక్‌కి దూరంగా సాగుతున్నట్టు అనిపిస్తుంది.
కబడ్డీ కోచ్‌గా గోపీచంద్ డీసెంట్ యాక్టింగ్ చేశాడు. అలాగే యాక్షన్ సన్నివేశాల్లో తన మార్కును మరోసారి చూపించాడు. ఎమోషన్ ఒకే కాని కామెడీకి స్కోప్ లేకపొవడం పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. తెలంగాణ యాసలో తమన్నా డైలాగ్స్ కొత్తగా అనిపించాయి. అలాగే జ్వాలారెడ్డి సాంగ్ లో గ్లామర్‌తో ఆకట్టుకుంది. దిగంగన క్యారెక్టర్‌కు అంత స్కోప్ లేదు. ఫస్టాఫ్‌లో రావు రమేశ్ తన డైలాగ్స్ విలనిజాన్ని పండిస్తే.. సెకండాఫ్‌లో తరుణ్ అరోరా విలన్‌గా ఆకట్టుకున్నాడు. హీరో తల్లి పాత్రలో ప్రగతి, చుట్టు పక్కల ఉండేవాళ్ల పాత్రల్లో అన్నపూర్ణమ్మ అండ్ గ్యాంగ్ పాత్రలు కాస్తో కూస్తో కామెడీతో ఆకట్టుకున్నాయి. కబడ్డీ జట్టు కెప్టెన్ ప్రీతికి మంచి సీన్స్ పడ్డాయి. మిగతా అమ్మాయిలు కూడా చక్కగా నటించారు.
సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, మణిశర్మ నేపథ్య సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణలు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నా కథ కథనాలు బలహీణంగా ఉండడం ఈ సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. మొత్తానికి మాస్ ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
బలాలు
బలహీనతలు
రేటింగ్ : 2.75