ఆర్ ఆర్ మూవీ మేక‌ర్స్ నిర్మాత ఆర్ ఆర్ వెంకట్ మృతి

September 27, 2021

ఆర్ ఆర్ మూవీ మేక‌ర్స్ నిర్మాత ఆర్ ఆర్ వెంకట్ మృతి

ప్రముఖ నిర్మాత, రచయిత..సామాజిక వేత్త ఆర్ఆర్ వెంకట్ (57) కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు జె . వి వెంకట్ ఫణింద్ర రెడ్డి. సెప్టెంబర్ 27 ఉదయం హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్స్ లో కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఉదయం 5. 30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆర్. ఆర్. మూవీ మేకర్స్ ద్వారా ఆయన పలు చిత్రాలను పంపిణీ చేయడమే గాక నిర్మాతగానూ భారీ సినిమాలను తెరకెక్కించారు.

మహేష్ తో బిజినెస్ మేన్.. నాగార్జునతో ఢమరుకం.. రవితేజతో కిక్ లాంటి అత్యంత భారీ చిత్రాల్ని వెంకట్ నిర్మించారు. సామాన్యుడు, మాయాజాలం, హంగామా, గుండమ్మగారి మనవడు, బహుమతి, ప్రేమ కావాలి, డాన్ శ్రీను,పైసా, లవ్లీ, విక్టరీ చిత్రాలకు వెంకట్ నిర్మాత. 2012 లో జోనాథన్ బెన్నెట్ నటించిన ఆంగ్ల చిత్రం వెడ్డింగ్ ఇన్విటేషన్ చిత్రంతో RR వెంకట్ హాలీవుడ్ లోకి ప్రవేశించారు. ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత ఎస్.వి కృష్ణ రెడ్డి దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ – రమ్య కృష్ణ నటించిన ఆహ్వానం చిత్రానికి రీమేక్. ఆ తర్వాత అనేక తెలుగు చిత్రాలను నిర్మించారు. అవార్డు గెలుచుకున్న రొమాంటిక్ థ్రిల్లర్ హిందీ చిత్రం ఏక్ హసినా థీకి నిర్మాతలలో ఒకరు.

ఆర్.ఆర్ వెంకట్ రచయిత.. సామాజిక కర్త గానూ పేరు తెచ్చుకున్నారు. వెంకట్ ప్రతి సినిమా విడుదల సందర్భగా సేవా సంస్థలకు ఐదు లక్షల రూపాయలను అందించేవారు. 2011 లో సామాజిక కార్యకర్తగా ఆయ‌న‌ చేసిన కృషికి కొలంబో విశ్వవిద్యాలయంలో కాంప్లిమెంటరీ మెడిసిన్స్ కోసం ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. ఆయన మృతిప‌ట్ల ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.