September 23, 2021
శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్లో రాబోతోన్న ‘మహా సముద్రం’ సినిమా మీద టాలీవుడ్లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఆర్ ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇన్టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నేడు హైదరాబాద్ ఏఏంబి మాల్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు.
మహాసముద్రం ట్రైలర్లో డైలాగ్స్ అదిరిపోయాయి. ‘సముద్రం చాలా గొప్పది మహా.. చాలా రహస్యాలు దానిలోనే దాచుకుంటుంది, ఇక్కడ మనకి నచ్చినట్టు బతకాలంటే.. మన జాతకాల్ని దేవుడు మందుకొట్టి రాసుండాలి’ అంటూ శర్వానంద్ చెప్పే డైలాగ్.. ‘నవ్వుతూ కనిపిస్తున్నంతా మాత్రానా బాగున్నట్టు కాదు అర్జున్.. నువ్ సముద్రం లాంటి వాడివి అర్జున్.. అన్ని నదులు నీలో కలవాలని అనుకుంటాయి’అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్స్.. ‘మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా’ అంటూ సిద్ధార్థ్ పలికే డైలాగ్స్ అదిరిపోయాయి. ఇక రావు రమేష్ చెప్పిన.. ‘ నేను దూరదర్శన్‌లో మహాభారత యుద్ధం చూసిన మనిషినిరా.. ఎదుటోడు వేసిన బాణానికి ఎదురు ఏ బాణం వేయాలో నాకు బాగా తెలుసు’ అందరికీ గుర్తుండిపోయేలా ఉంది.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…
దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ.. ‘ట్రైలర్ అందరికీ నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. ఓపెన్ డ్రామా, వయలెంట్ లవ్ స్టోరీ, యాక్షన్ సమ్మేళనం, ఆర్టిస్ట్‌ల పర్ఫామెన్స్, టెక్నీషియన్ల పని తీరు ఇలా ప్రతీది పరిపూర్ణంగా.. వంద శాతం మీకు కనిపిస్తాయి. మంచి మ్యూజిక్, ఆర్ట్ పనితనం, వైజాగ్‌లో అత్యధిక రోజులు పని చేసింది మేమే. దాదాపు 70 రోజులు అక్కడే షూటింగ్ చేశాం. ఇది మననేటివిటి చిత్రం. ప్రతీ ఒక్క కారెక్టర్ మహా అద్భుతంగా ఉంటుంది. ఇది వరకు ఎన్నడూ కూడా చూడని భావోద్వేగాలు ఇందులో ఉంటాయి. ఆర్ఎక్స్ 100 సినిమా సమయంలోనే అలానే చెప్పాను..కానీ ఎవ్వరూ నమ్మలేదు. సినిమా విడుదల తరువాత అందరూ మెచ్చుకున్నారు. మహా సముద్రంలో అంతకు మించి ఎమోషన్స్ ఉంటాయి. ఇదొక అద్భుతమైన కథ. ఇద్దరు హీరోలను పట్టుకోవడం నాకు కష్టమైంది. ఇందులో కాంప్లికేటెడ్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. అందుకే ఆర్ ఎక్స్ 100 తరువాత ఈ సినిమా ప్రారంభించడానికి చాలా టైం పట్టింది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ప్రతీ ఒక్కరూ ఎంతో సపోర్ట్ చేశారు. ఏ ఒక్కరూ కూడా ఎందుకు లేట్ అవుతుందని అడగలేదు. చాలా ఫ్రీగా, ఓపెన్‌గా తీశాను. మహాసముద్రంతో బ్లాక్ బస్టర్ కొట్టబోతోన్నాం కాదు.. బ్లాక్ బస్టర్ అయింది. ఈ కథ చెప్పిన వెంటనే శర్వానంద్ ఓకే అన్నారు. ఒక్క డౌట్ కూడా అడగలేదు. నేను ఆర్ఎక్స్ 100 కంటే ముందే శర్వానంద్ కోసం ఓ కథ రాసుకున్నాను. కానీ అప్పుడు ఆయన దగ్గరికి కూడా వెళ్లలేకపోయాను. ఈ స్క్రిప్ట్ రాసుకున్న తరువాత కథ చెప్పడం మొదలుపెట్టాను. జగపతి బాబు గారు ఆయన కెరీర్లో ఇంత వరకు ఇటువంటి పాత్ర చేయలేదు. మహా సముద్రం చాలా పెద్ద కథ. నేను డీప్ క్యారెక్టరైజేషన్‌లోంచి కథ రాస్తాను. ప్రతీ పాత్రకు ఓ ప్రారంభం ఉంటుంది.. ముగింపు ఉంటుంది. అనవసరంగా ఓ పాత్రను తెర మీదకు తీసుకురావడం తప్పు అని నేను అనుకుంటాను. మహాసముద్రంలో శర్వా, సిద్దు, అదితి, అను, జగపతి బాబు, రావు రమేష్ ఇలా వీరందరి మధ్యే కథ ఉంటుంది. ఈ పాత్రల మధ్య ఉండే భావోద్వేగమే మహా సముద్రం. రావు రమేష్ గారి పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఇది పూర్తిగా కల్పిత కథే. టైటిల్‌కు కచ్చితంగా న్యాయం జరుగుతుంది. మహా అనేది అమ్మాయి పేరు. సముద్రానికి రెండు రకాల లక్షణాలుంటాయి. ఒకటి సైలెంట్‌గా ఉంటుంది.. మరొకటి ఎగిసి పడుతుంటుంది. అందులో సైలెంట్ ఎవరు? ఎగిసిపడేది ఎవరు? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది’ అని అన్నారు.
కెమెరామెన్ రాజ్ తోట మాట్లాడుతూ.. ‘సినిమాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. ట్రైలర్లో ఏం చూశారో అంతకంటే డబుల్ ఉంటుంది. ఇక మిగిలింది సక్సెస్ మీట్లో మాట్లాడతాను’ అని అన్నారు.
చేతన్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘కష్టపడి చేసిన ప్రయత్నం జనాలకు రీచ్ అయితే.. ఆ ఆనందం వేరుగా ఉంటుంది. పాటలు, ట్రైలర్ ఇంత బాగా ఆదరణ దక్కించుకోవడం సంతోషంగా ఉంది. ఈ మూవీ చేయడం నాకు ఎంతో సవాల్‌గా అనిపించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు నాకే కొత్తగా అనిపించింది. ఐదో సినిమానే ఇంత మంచి ప్రాజెక్ట్ రావడం ఆనందంగా ఉంది. దర్శకుడు అజయ్ భూపతి, నిర్మాతలకు థ్యాంక్స్. ఈ చిత్రం సక్సెస్ అవుతుందని ఎంతో నమ్మకంగా ఉంది’ అని అన్నారు.
అను ఇమాన్యుయేల్ మాట్లాడుతూ.. ‘మీడియా ముందుకు వచ్చి రెండేళ్లు అవుతుంది. ఇలా మహాసముద్రంతో మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ ట్రైలర్ నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. అక్టోబర్ 14న ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది. ఫ్యామిలీతో కలిసి చూడండి’ అని అన్నారు.
శర్వానంద్ మాట్లాడుతూ.. ‘ఇంత పెద్ద సినిమా తీయడానికి ముందుకు వచ్చిన అనిల్ సుంకర గారికి థ్యాంక్స్. ఎప్పుడూ ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. ఈ రోజు దూకుడు చిత్రం విడుదలైందని.. ఆ సినిమాతో నా కెరీర్ మొదలైంది అని.. అదే రోజు మహాసముద్రం ట్రైలర్ విడుదలవుతుందని అనిల్ సుంకర గారు చాలా ఎమోషనల్ అయ్యారు. ఇది శుభసూచికం. రేపు లవ్ స్టోరీ విడుదలవుతోంది. అది కూడా మన సినిమానే. ఫ్యామిలీతో కలిసి ఏ భయాలు పెట్టుకోకుండా చూడవచ్చు. ప్రభుత్వం కూడా వందశాతం ఆక్యుపెన్సీ ఇచ్చింది. మహా సముద్రం అక్టోబర్ 14న రాబోతోంది. థియేటర్ అనుభూతిని ఇచ్చేందుకు ట్రైలర్ ఈవెంట్‌ను ఏఎంబీలో ఏర్పాటు చేశాం. అజయ్ చాలా మంది హీరోల దగ్గరికి వెళ్లాడు. నా దగ్గరికి ఎందుకు రాలేదు అని అడిగాను. రెండు నెలలు మిమ్మల్ని కలవడానికి ప్రయత్నించాను కానీ దొరకలేదు అని చెప్పాడు. ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఒక్క ప్రశ్న వేయకుండా ఓకే చేశాను. అలా అడిగే చాన్స్ అజయ్ భూపతి ఇవ్వలేదు. డైలాగ్ టు డైలాగ్ చెప్పేశాడు. కథలో బయటకు వెళ్లడు. తొమ్మిది పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది. కథని కథలా చెప్పాడు. ఈ కథకు ప్రతీ పాత్ర హీరోనే. అంత చక్కగా అల్లుకుని రాసుకున్నాడు. అనవసరంగా వచ్చిన పాత్ర ఒక్కటి కూడా ఉండదు. ప్రతీ డైలాగ్ కూడా వారి పాత్రల్లోంచే వస్తుంది. ఇలాంటి చిత్రం ఈ మధ్య కాలంలో ఇంత వరకు చూడలేదు. హిట్ సినిమాలకు మాత్రమే రాజ్ తోట పని చేస్తారేమో. ఆయన అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. చేతన్ భరద్వాజ్ అదిరిపోయే పాటలు ఇచ్చాడు. ఈ చిత్రంలోని అన్ని పాటలు బాగుంటాయి. అను ఇమాన్యుయేల్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. అన్ని పాత్రలు మీ ముందుకు వచ్చి ఈవెంట్‌ను చేద్దామని అనుకున్నాం. కానీ కుదర్లేదు. ఈ సినిమా కోసం ఏదైనా హోం వర్క్ చేయాలా అని అడిగితే.. అదేం వద్దు.. హాయిగా ఉండండి.. సెట్లో నేను చెప్పింది చేయండి అని అజయ్ భూపతి అన్నారు. ప్రతీ ఒక్కరూ ఫ్యామిలీతో కలిసి చూసే చిత్రం’ అని అన్నారు.